Geetha Koumudi-1    Chapters   

పండ్రెండవ కిరణము

కర్మయోగ బోధ

(గీత 3వ అధ్యాయము)

గీతలోని 3 వ అధ్యాయమైన కర్మయోగములో 43 శ్లోకము లున్నవి. ఈ 43 శ్లోకములలో దిగువ నుదహరించిన ప్రకారము 4 రకాల బోధచేయబడినది.

1. నిష్ఠాద్వయబోధ- 1నుంచి 3 వరకు శ్లోకాలు.

2. కర్మయోగబోధ- 4 నుంచి 32, 35 శ్లోకాలు.

3. దైవపౌరుషబోధ- 33 నుంచి 34 శ్లోకాలు

4. కామజయబోధ- 36నుంచి 43 శ్లోకాలు.

1. నిష్ఠాద్వయబోధ (1 నుంచి 3 శ్లోకాలు)

గీతలోని 2 వఅధ్యాయమైన సాంఖ్యయోగములో శ్రీకృష్ణపరమాత్మయొక్క బోధ స్వరూపము (1) ఆత్మ తత్త్వబోధ లేక జ్ఞానబోధ (2) నిష్కామ కర్మబోధ లేక కర్మయోగబోధ అని ద్వివిధముగ నున్నదని లోగడ తెలిసి కొన్నాము. ఈ రెండు రకాల బోధలలో ఆత్మతత్త్వజ్ఞానము వల్ల కృతార్థత మోక్షప్రాప్తి అని శ్రీకృష్ణుడు బోధించి, అర్జునుని మాత్రము కర్మయోగమునే అవలంబించమని చెప్పి, అట్టి కర్మయోగమువల్ల మోక్షము ప్రాప్తించునని ఐనను చెప్పియుండలేదు. ఇంకను కర్మయోగము హింసతో కూడియున్నది. అందుచేత అర్జునునికి సంశయము కలిగి కృష్ణునితో ఆ సంశయమును 3వ అధ్యాయములోని మొదటి 2 శ్లోకాలలో ఈ విధంగా వ్యక్తం చేయుచున్నాడు. కృష్ణా! కర్మయోగంకంటె జ్ఞానయోగమే గొప్పదని చెప్పినావే; అలా అయితే నికృష్టమైనదిన్నీ హింసారూపమైనదిన్నీ అయిన ఈ ఘోరమైన కర్మయోగాన్నే నన్ను అవలంబించమని ఎందుకు ఆజ్ఞాపించుచున్నావు? (1) నీమాటలు నన్ను కలవర పెట్టుచున్నవా అన్నట్లుగాను, మోహపెట్టుచున్నవా అన్నట్లుగాను ఉన్నవి. కనుక కర్మజ్ఞానాలలో ఏది నాకు శ్రేయప్రదమో దానిని నాకు నిశ్చయించి చెప్పుము (2) అని అర్జునుడు కృష్ణుని ప్రశ్న చేసినాడు. కృష్ణుని బోధలో కలవరపెట్టే స్వభావం కాని మోహపెట్టే లక్షణం కాని ఉన్నదని అర్జునుని భావంకాదు. తాను సరిగా అర్థము చేసికోలేక పోయినందున ఆవిధంగా ఉన్నవా అన్నట్లున్నదని అర్జునుడు అన్నాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణ పరమాత్మ 3 వశ్లోకమును చెప్పినాడు. 'అర్జునా ! కర్మయందు అధికారము గలవారికి కర్మనిష్ఠ, జ్ఞానమునందు అధికారము కలవారికి జ్ఞాననిష్ఠ అని ఒకేనిష్ఠ సాధ్యసాధనావస్థాభేదముచే రెండు విధములుగ కనపడుచున్నది. అని లోగడ నేను చెప్పియున్నాను. చిత్తము శుద్ధము కానంతవరకు కర్మనిష్ఠను అనుసరించవలెను. చిత్తము శుద్ధమైన తరువాత వైరాగ్యం కలుగగా, కర్మసన్యాస మొనరించి జ్ఞాననిష్ఠను అనుసరించవలెను. అట్టి నిష్ఠచే కలిగిన ఆత్మజ్ఞానమువల్ల మోక్షము ప్రాప్తించును. కనుక జ్ఞానయోగమునకు కర్మయోగము సాధనము. నీవు జ్ఞాననిష్ఠకు అధికారివి కావు. నీ కింకను చిత్తము శుద్ధికావలెను. కనుక నీకు కర్మయోగమునందే అధికారము. నీవు ఆకారణముచేత కర్మనే చేయుము, అని కృష్ణుడు నిష్ఠాద్వయమును బోధించినాడు.

2. కర్మయోగబోధ (4 నుంచి 32 వరకు, 36 శ్లోకాలు - 30 శ్లోకాలు)

పై విధంగా కృష్ణుడు అర్జునునికి కర్మయందే అధికారము అని చెప్పి ఆ కర్మయోగమును 30 శ్లోకాలలో విపులంగా వివరించి బోధించుచున్నాడు. ఈ 30 శ్లోకాలలో కర్మయోగము 5 విధములుగా బోధించబడినది.

1. వ్యక్తిగత కర్మయోగము- 4 నుంచి 9, 19, 30 నుంచి 32, 35 శ్లోకాలు.

2. సమిష్టి రూప కర్మయోగము- 10 నుంచి 13 వరకు శ్లోకాలు.

3. జగచ్ఛక్ర ప్రవర్తక కర్మయోగము - 14 నుంచి 16 వరకు శ్లోకాలు.

4. లోకసంగ్రహ కర్మయోగము - 20 నుంచి 26 వరకు శ్లోకాలు.

5. జ్ఞాన కర్మయోగము - 17, 18, 27, 28, 29, శ్లోకాలు.

1. వ్యక్తిగత కర్మయోగము (4 నుంచి 9, 19, 30, 31, 32, 38శ్లోకాలు)

అర్జునా! కర్మయోగముచే చిత్తశుద్ధి కలుగగా, కర్మసన్యాసమును గావించి, జ్ఞానయోగమును అవలంబించ వలెను. ఆత్మ ఎట్టి కర్మను చేసేది కాక నిష్ర్కియము కనుక, జ్ఞాననిష్ఠ అట్టి నైష్కర్మ్యస్థితి, అట్టి నైష్కర్మ్యస్థితికి కర్మయోగమే సాధనము. కర్మలను నిష్కామంగా చేస్తేనే కర్మలను చేయకుండా ఉండే నైష్కర్మ్యస్థితి వచ్చును. కనుక కర్మలను చేయుట ఎందుకనగా, కర్మలను మానివేసేస్థితి వచ్చేటందుకే. చివరకు కర్మలను మానవలసిందే కనుక, ఇప్పుడే కర్మలను మానివేస్తానంటావేమో, ఇప్పుడే మాని వేస్తే కర్మలను మానివేసేస్థితి అసలు రానేరాదు. రోగం పోయేటందుకు ఔషధసేవచేస్తే రోగం పోయి, ఔషధం పుచ్చుకొనవలసిన అవసరం లేకుండా పోవును. కనుక ఔషధం సేవించు టెందుకంటే ఔషధం సేవించకండా ఉండేటందుకే. చివరకు ఔషధం సేవించనక్కరలేదు. కనుక ఇప్పుడే ఔషధం సేవించను అంటే, రోగమే పోదుకదా! అలాగే కర్మలను చేయుట, కర్మలను మానేటందుకే. కనుక అర్జునా! కర్మలను చేస్తేనే నైష్కర్మ్యస్థితి వచ్చునుకాని కర్మలను మానినందువల్ల నీకు నైష్కర్మ్యస్థితి ఎప్పటికి రానేరదు. పోనీ, సన్నాసాశ్రమ స్వీకారం చేసి కర్మలను మానివేస్తానంటావేమో, సన్యాసాశ్రమానికి చిత్తశుద్ధి వైరాగ్యం అవసరం. కనుక అట్టి లక్షణాలు లేకుండా అనగా సన్యాసాశ్రమానికి అధికారం లేకుండా సన్యసించినట్లయితే, దానివల్ల జ్ఞాననిష్ఠకు అధికారం రాదు. అట్టి వాడు భ్రష్టుడగును. (4) ఇంకను అర్జునా! మానవుడు ఏదో ఒకకర్మను చేయకుండా, ఒక క్షణమైనను ఉండలేడు. వాని సత్వరజస్తమాత్మకమైన ప్రకృతి వానిచేత ఏదోపనిని అవశ్యంగా చేయించును. (5) కర్మేంద్రియాలను నిరోధించి ఉదాసీనముగా నిశ్చలముగా ఉంటానంటావేమో అలా కర్మేంద్రియాలను నిరోధించినను మనస్సుతో విషయాలను స్మరించకుంéడా ఉండ లేవు కనుక విషయాలను స్మరించుచూ ఉంటావు. అట్టిది బకధ్యానం. అట్టివాడు దంభాచారుడు, ఆత్మవంచకుడు, (6) అట్టి వానికంటె మనస్సుచేత జ్ఞానేంద్రియాలనునియమించి కర్మేంద్రియాలచేత కర్మయోగమును ఆచరించేవాడు ఉత్కృష్టుడు. (7). కనుక అర్జునా! ఏదో కర్మను చేయకుండా ఎవడు ఉండలేడు కనుక, అశాస్త్రీయమైనకర్మను చేయుటకంటె శాస్త్రీయమైన కర్మను చేయుము. అసలు ఏకర్మను చేయకపోతే నీకు శరీరయాత్ర కూడా జరుగదుగదా? కనుక నీకు శాస్త్రప్రకారం నియమితమైన కర్మను ఫలాపేక్ష లేకుండా తప్పక చేయుము. (8). అట్టి నియమితమైన కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో ఫలమునందు ఎట్టి ఆసక్తి లేకుండా చేయుము. అలా కాక ఫలాపేక్షతో చేసిన కర్మబంధకమగును; కనుక నీవు నియతమైన కర్మను యజ్ఞార్థం అనగా భగవత్కర్మగా భగవత్సేవగా ఫలాపేక్ష లేకుండా చేయుము. (9) ఇట్లు అసక్తుడై విహితకర్మను భగవత్సేవగా చేస్తే క్రమేణ మోక్ష ప్రాప్తియు కలుగును. కనుక అసక్తుడవై నిష్కామకర్మయోగమును అవలంభించుము. (10) అర్జునా! ఈ కర్మయోగమును అవలంబించుటలో ఒక రహస్యమును చెప్పెదను వినుము. నేను ఈ కర్మలను ఈశ్వరునికొరకు భృత్యునివలె చేయుచున్నాను అను వివేకబుద్ధితో అన్ని కర్మలను ఈశ్వరునికి అర్పణము చేసి, ఫలమును కోరక మమకారమును విడిచి కర్మలను చేయుము. అట్టి బుద్ధితో నేనీవిపుడు యుద్ధము కూడ చేయుము.(30) ఎవరైతే ఈ కర్మయోగమును శ్రద్ధతోను, అసూయ లేకుండాను ఆచరిస్తారో వారు కర్మబాధలనుండి విడువబడుదురు (31) అలాకాక ఎవరైతే అసూయాగ్రస్తులై ఈ కర్మయోగమును అభ్యసించరో వారు మూఢులు, అవివేకులు అని తెలుసుకొనుము (32) ఇంకను అర్జునా! ఈ కర్మయోగమును అభ్యసించుటలో ఒక ధర్మసూక్ష్మ మున్నది. శాస్త్రీయమైన కర్మను ఫలాపేక్ష లేకుండా చేయమన్నాను. కనుక నీవు యుద్ధమును మానివేసి చేస్తానన్న భిక్షాటనము కూడ శాస్త్రీయమే కనుక దానిని ఎందుకు చేయరాదు అని అంటావేమో, అది కూడదు. ఎవరివర్ణమునకు ఎవరి ఆశ్రమమునకు ఏది విహితమో ఆకర్మనే ఫలాపేక్ష లేకుండా చేయవలెను కాని, ఇంకొక వర్ణమునకు ఇంకొక ఆశ్రమమునకు విహితమైన కర్మను చేయరాదు. ఎవరి వర్ణాశ్రమములకు శాస్త్రము ప్రకారము ఏదివిహితమో అదియే వారి స్వధర్మము. మిగతా వర్ణములకు, ఆశ్రమములకు శాస్త్రప్రకారము విహితమైనదే అయినను అది నీకు పరధర్మమే అగును, కనుక చేయరాదు. శాస్త్ర విహితకర్మ స్వధర్మమని పరధర్మమని రెండువిధములుగా నున్నది కనుక ఎవరి స్వధర్మకర్మను వారు ఫలాపేక్ష లేకుండ చేస్తే వారికది కర్మయోగమగును. కాని పరధర్మమును ఆచరించుట కర్మయోగము కానేరదు. స్వధర్మాచరణములో కొంతలోప మున్నను అది బాగుగా అనుష్ఠింపబడిన పరధర్మాచరణము కంటే శ్రేష్ఠమైనది. శ్రేయఃప్రదమైనది అయి యున్నది. స్వధర్మాచరణము చేయుచు మరణించిననూ మేలే. అంతేకాని పరధర్మాచరణము నరకాది భయమును కలుగచేయును, కనుక అర్జునా! నీవు క్షత్రియుడవు కనుక, నీ స్వధర్మమైన యుద్ధమును ఫలాపేక్ష లేకుండా చేయుము. అదియే నీకు నిష్కామకర్మ యోగము అయి శ్రేయః ప్రదమగును. అంతేకాని భిక్షాటనము శాస్త్రీయమే అయినను నీకు పరధర్మము. భిక్షాటనము బ్రాహ్మణజాతికి మాత్రమే స్వధర్మము. (35) ఇట్లు కృష్ణపరమాత్మ అర్జునునకు వ్యక్తిగత కర్మయోగమును బోధించినాడు.

సమిష్టిరూప కర్మయోగము: - (10 నుండి 13 శ్లోకములు)

ఇంకను అర్జునా! ప్రజాపతి ఏర్పాటుచేసిన సమిష్టి కర్మయోగము ననుసరించి కూడ అధికృతులైనవారు కర్మ చేయవలెను. ఆ సమిష్టి కర్మయోగ మేమనగా, ప్రజాపతి ప్రజలను సృష్టిచేసినపుడు యజ్ఞసహితముగ నే వారిని సృజించి వారితో ఈ యజ్ఞాదులద్వారా మీరు మీ సర్వాభీష్టములను పొందంéడి అని ఏర్పాటు చేసెను (10). ఈ యజ్ఞాదులద్వారా మీరు దేవతలను తృప్తి పరచితే దేవతలు మీ అభీష్టము లను నెరవేర్చి మిమ్ములను తృప్తిపరచెదరు. ఇట్లు మీరు, దేవతలు పరస్పరము తృప్తిపరచు కొనుచు శ్రేయస్సును పొందండి అని ప్రజాపతి ప్రజలతో చెప్పెను. కనుక అధికృతులైన ప్రజలు తమకు విహితమైన యజ్ఞాది కర్మములను చేసినచో దేవతలు సంతోషించి ప్రజలకు అభీప్సితములగు అన్ని భోగములను అనుగ్రహించెదరు (11). అట్లు వారి చే అనుగ్రహింపబడిన సన్యాది భోగములను వారికి నివేదింపకుండగ భుజించినచో వారు దొంగలే అగుదురు. ప్రజలు అనుభవించు భూములు, సస్యములు, ఉదకములు, తేజస్సులుమున్నగునవన్నియు భగవద్దత్తములే కాని ప్రజలు స్వయముగా సంపాదించనవి కావు. కనుక, అట్టివాని నన్నింటిని భగవదర్పణము చేయక స్వీయములు అని అనుభవించినవారు దొంగలే కదా! (12). అట్లు కాక భగవద్దత్తములైనవాని నన్నింటిని భగవదర్పణముచేసి కత్తిపీట, పొయ్యి, సన్నికల్లు, చీపురు, నీళ్ళకడవలద్వారా ప్రాప్తించెడు జీవహింసారూపమైన పంచ పాపములను పోగొట్టుకునేటందుకు దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషియజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము అను పంచమహాయజ్ఞముల నాచరించి మిగిలిన అన్నమును భుజించినచో ఆ అన్నము అమృతమై వారి సర్వపాపములను పోగొట్టును. అట్లు కాకుండా తాము వండుకున్న అన్నమును భగవన్ని వేదనకు కాక తమకొరకే వండుకున్నామని భావించి తిన్నచో వారుపాపమునే తిన్నవారగుదురు. (13) కనుక ప్రజలు ఇట్టి సమిష్టిరూప కర్మయోగమును అనుసరించవలెను అని కృష్ణుడు అర్జునునకు బోధించినాడు.

3) జగచ్ఛక్రప్రవర్తక కర్మయోగము - (14 నుంచి 16 శ్లోకాలు)

ఇంకను అర్జునా! ఏకర్మకు అధికారము కలవారు ఆ కర్మను అనుసరించి తేనే జగచ్ఛక్రము ప్రవర్తించును. మనుష్యులు అన్నమువలన పుట్టుచున్నారు. ఆ అన్నము వర్షము వలన, ఆ వర్షము అపూర్వమువలన, ఆ అపూర్వముయజ్ఞాది రూప కర్మవలన కలుగును. ఆ కర్మ వేదప్రతిపాదితము. ఆ వేదము పరమేశ్వరునివలన వ్యక్తమైనది, మనుష్యులు అధికృతులయి ఆయాకర్మలనాచరించినచో అపూర్వము, వర్షము, అన్నము, మనుష్యులు కలుగుదురు. ఇట్టి జగచ్ఛక్రప్రవర్తకర్మను అనుసరించియైనను అర్జునా ! కర్మ చేయవలెను అని కృష్ణుడు బోధించెను (14, 15, 16 శ్లోకాలు)

(4) లోకసంగ్రహ కర్మ యోగము (20-26 శ్లోకాలు)

మరియు, అర్జునా! జనకాదిక్షత్రియులు జ్ఞానులైనను లోక సంగ్రహముకొరకు, అనగా లోకముయొక్క ఉన్మార్గ ప్రవృత్తినివారణకొరకై సన్యసించకుండా కర్మల చేయుచునే సిద్ధిని పొందిరి. నీవును క్షత్రియుడవు కనుక అట్టి జనకాదులను అనుసరించియైనను లోకసంగ్రహార్థము కర్మలను చేయుము. (20). లోకములో శ్రేష్ఠుడైనవాడు దేనిని ఆచరించునో దానినే ఇతరులందరు ఆచరింతురు. అట్టి శ్రేష్ఠుడు దేనిని ప్రమాణముగా స్వీకరించునో, ఇతరులును దానినే ప్రమాణముగా స్వీకరించెదరు. (21), ఇంకను అర్జునా! నాకు మూడు లోకములలోనూ కూడా చేయతగిన కర్మయు ఏదియును లేదు. నాకు పొందబడనిదికాని పొందతగినది కాని ఏదియునులేదు. అయినను నేను కర్మలను చేయుచున్నాను కదా! (22). నేనేకనుక అలసుడనై ఒకానొకప్పుడైనను కర్మలను చేయనిచో అజ్ఞులగు మనుష్యులు సర్వవిధములచేత నన్నే అనుసరించి వారును కర్మలను మానివేయుదురు. (23), అట్లు నేను కర్మలను మానినందువల్ల ప్రజలుకూడ కర్మలను మానుట సంభవించినచో వారందరు చెడిపోవుదురు. అట్టి వారి సాంకర్యమునకు నేను కర్తను కావలసివచ్చును. వారి నందరిని నశింపచేయువాడ నగుదును. (24). ఇంకను జ్ఞానులైనవారు కర్మలను ఏవిధముగా చేయవలెనంటే అజ్ఞానులు ఆసక్తికలవారై ఏవిధముగా కర్మలను చేయుదురో, జ్ఞానులు అట్టి ఆసక్తి మాత్రము లేకుండా ఆవిధముగానే లోకసంగ్రహముకొరకు కర్మలను చేయవలెను. (25). కర్మలందు ఆసక్తి గల అజ్ఞానులకు 'నాకిది కర్తవ్యము, దీనిఫల మనుభవింప తగినది' అను బుద్ధి ఉండును. జ్ఞానియైనవాడు అజ్ఞానులకున్న అట్టి బుద్ధిని చలింపచేయరాదు. మరియు అట్టి అజ్ఞానులకు ఆ కర్మలందు శ్రద్ధను ప్రీతిని జనింపచేయుచూ, జ్ఞానియైనవాడు తాను సావధానమనస్కుడై ఆకర్మలను తాను స్వయముగా చేయుచు ఆ అజ్ఞానులచే కర్మలను చేయించవలెను. (26). ఇట్టి లోకసంగ్రహ కర్మలను అనుసరించియైనను అర్జునా! నీవు కర్మను చేయవలెను, అని కృష్ణుడు బోధించెను.

5. జ్ఞాని కర్మయోగము (17, 18, 27, 28, 29 శ్లోకాలు)

ఇట్లు పైన తెలియపర్చిన నాలుగు విధాలుగా కూడా కర్మఅవశ్యకర్తవ్యమైతే, అందరు అనుసరించితీరవలెనేగదా, అని అర్జునునిప్రశ్నను ఆశంకించుకొని, కృష్ణపరమాత్మ ఈ విధంగా జవాబు చెప్పుచున్నాడు. ఆత్మజ్ఞానము కలవారికి ఈ కర్మ అనుసరణీయము కాదు. ఆత్మజ్ఞానము లేకుండా జగత్తు సత్యమనిన్నీ జగత్తులోని విషయాలలో ఆనందము ఉన్నదనిన్నీ భావించు అజ్ఞానులు తప్పక కర్మయోగమును అనుసరించి తీరవలెను.అట్టి కర్మయోగానుష్ఠానమువల్ల చిత్తశుద్ధి కలిగితే ప్రపంచమునందు వైరాగ్యము కలుగగా సన్యసించి, గురువుయొద్దకు వెళ్ళి, శ్రవణమననధ్యానాదులచే ఆత్మజ్ఞానము కలవారగుదురు. ఆత్మ సచ్చిదానందమై సర్వ వ్యాపకమైనది కనుక అట్టి ఆత్మయందే రతి, తృప్తి, సంతుష్టిరూప ఆనందమును సంపూర్తిగా అట్టి ఆత్మజ్ఞాని అనుభవించును. వానిదృష్టిలో ప్రపంచము వేరుగాలేదు; ఉన్నదంతా ఆత్మయే, ప్రపంచము వస్తుత్వము లేకుండా కనపడుట మాత్రమే లక్షణముగాగలది కనుక మిథ్య, ప్రపంచము సత్యము. ఆనందదాయకము అనుకొనువారికే కర్మానుష్ఠానము అవసరము. అజ్ఞానులు భార్యవల్ల రత్యానందమును, భోజనాదులవల్ల తృప్త్యానందమును, ఇతర సంపదలవల్ల సంతుష్ట్యానందమును పొందుతున్నామని అనుకొను చున్నారేకాని ఆ మూడు రకాల ఆనందములు కూడ వాస్తవములో ఆత్మానందమే. అది ఆయా విషయములద్వారా వ్యక్తమగుచుండగా, ఆయానిషయములే ఆనందమును ఇచ్చుచున్నవని అజ్ఞానులు భ్రమపడుచున్నారు. విషయానందము అనిత్యమై సోపాధికమై సాతిశయముగ నుండగా, ఆత్మానందము నిత్యమై, నిరుపాధికమై, నిరతిశయమై విరాజిల్లుచున్నది. అట్టి నిత్యమైన ఆత్మానందమును అనుభవించు ఆత్మజ్ఞానులు చేయతగిన కర్మము ఏదియులేదు. ఆనందము లేనివారికి తదర్థమై కర్మఅవసరముకాని, ఆనందము నిత్యానుభవములో నున్న జ్ఞానులకు ఏవిధమైన కర్మ అవసరము లేదు (17). అట్టి జ్ఞానికి కర్మచేస్తే వచ్చే ప్రయోజనంలేదు. కర్మచేయక పోతే వచ్చే ప్రత్యవాయములేదు. ఏదోయొక భూతవిశేషము నాశ్రయించి సాధింపతగిన ప్రయోజన మేదియు ఆత్మరతుడగు జ్ఞానికి లేదు. (18). కాని ఆత్మజ్ఞానులు కూడా కొన్ని పనులు చేయుచున్నట్లు కనపడుతారే అంటే పైన చెప్పినట్లుగా సచ్చిదానంద సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపమును సాక్షాత్కారించుకొన్న ఆత్మజ్ఞానులకు చేయతగిన దేమియు లేదు కనుక వారు ఏమీ చేయుట లేదు. కానీ చేస్తున్నట్లు మనకు కనపడుచున్నారే అంటే వారి ఇంద్రియములు ఆయా విషయాలలో ప్రవర్తిస్తుంటే, వారు ఆయాపనులు చేస్తున్నాని రమనము అనుకొనుచున్నాము. కన్ను చూస్తున్నది. చెవి వింటున్నది. అంతే కాని నేను చూచుటలేదు. వినుటలేదు అను జ్ఞానము వారికి ఉంటుంది. అందుచేత వారు చేస్తున్నట్లు కనపడే కర్మ నిజంగా కర్మకాదు. కర్తృత్వబుద్ధితోనూ, ఫలాసక్తితోనూ చేసేది కర్మఅవుతుందికాని, కర్తృత్వబుద్ధిలేక, ఫలాసక్తిలేక ఇంద్రియాలు విషయాలలో ప్రవర్తిస్తున్నపుడు మనకు కర్మగా కనపడిననూ అది కర్మకాదు. అది కర్మాభాస లేక ఆ భాసకర్మ, కర్మవలె కనపడునది; కనుక జ్ఞానియొక్క కర్మ ఆభాసకర్మమేకాని కర్మకాదు (28). యధార్థ మిట్లుండగా దేహమే నేను అను దేహభ్రాంతికల అజ్ఞాని ఇంద్రియాలు చేస్తున్నపనులను తానే చేస్తున్నానని భ్రాంతిపడును. (27). అట్టి దేహాత్మ బుద్ధికలిగి ఆత్మజ్ఞాన శూన్యులగు కర్మసంగులను, ఆత్మజ్ఞానముకలవాడు బుద్ధిభేదమును కలుగచేయరాదు, అనగా కర్మలతో నేమిప్రయోజనము లేదు అని వారికి కర్మలందుగల శ్రద్ధాపూర్వకమగు బుద్ధిని తొలగింపరాదని భావము (28).

ఈ విధముగా శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు కర్మయోగమును ఐదు విధములుగా బోధించినాడు.

(3) దైవ పౌరుషబోధ (33, 34, శ్లోకములు)

జ్ఞానయోగముఉపేయముగను, దానికికర్మయోగము ఉపాయముగను ఈవిధముగా మోక్షమునకు చక్కని రాజమార్గము ఏర్పాటయి యుండగా, అందరు అట్టి మార్గమును అవలంబించి, సాధనమైన కర్మయోగమును ఎందుకు అనుసరించి మోక్షమును పొందుటలేదు అను శంకను తొలగించుటకుగాను కృష్ణపరమాత్మ దైవపౌరుషముల విచారణను ఈ 33, 34 శ్లోకములలో గావించుచున్నాడు. సాధారణముగ ప్రతిమానవుడును పూర్వజన్మకర్మ ననుసరించి ప్రవర్తించు చుండును. 'బుద్ధిః కర్మానుసారిణీ' అను ప్రమాణము ప్రకారము ఈ జన్మలో ఏ కార్మమునైనను చేయుటకు పూర్వ జన్మకర్మానుసారమే బుద్ధిపుట్టును కానిఅన్యధా కాదు. అట్టి పూర్వజన్మ కర్మసంస్కారము ప్రకృతి యనబడును. ఎంతజ్ఞానియైనను అట్టి ప్రకృతి ననుసరించియే ప్రవర్తించుచుండును. అట్టి ప్రకృతిని నిగ్రహించుట ఆత్మవేత్తకు గూడ శక్యము కానిచో మూఢులు తప్పక ప్రకృతి ననుసరించెదరు అని వేరుగా చెప్పనక్కరలేదు. అందుకు భిన్నముగా ఎవరి నిగ్రహముకాని, బోధకాని ఏమీ చేయలేదు. అందుచేత మోక్షమునకు చక్కని రాజమార్గము ఏర్పడియుండినను ప్రాగ్జన్మీయ సంస్కారబలముచే అట్టి మార్గమును అనుసరించరు (33).

ఇట్టి ప్రకృతినే దైవమని అంటారు. దైవమనగా పూర్వజన్మకర్మమే. ఇట్లు ప్రతిమానవుడు ప్రకృతి ననుసరించియే ప్రవర్తించేయెడల పురుషప్రయత్నమునకు అవకాశ##మే లేదు కావున'ఈ పనిని చేయుము; ఆ పనిని చేయవద్దు' అని విధిని షేధాత్మకమైన వేదశాస్త్రములు వ్యర్థములే అగును కదా అను శంకను తొలగించుటకుగాను 34 వ శ్లోకము చెప్పబడినది. మానవునియొక్క ప్రకృతి సంస్కారరూపమే కనుక అట్టి సంస్కారము ననుసరించి ఏదో ఒక వస్తువు యందు రాగమో, ద్వేషమో కలుగును. అట్టి రాగద్వేష సంబంధమైన బుద్ధి ననుసరించియే మానవుడు సాధారణముగా ప్రవర్తించును. అట్టి రాగద్వేష సంబంధమైన బుద్ధి కలగినంత మాత్రాన దాని ననుసరించి ప్రవర్తించి తీరవలెను అను నియమములేదు. ఆబుద్ధి మంచిదే అయినచో దానిని అనుసరించుటకును మంచిది కానిచో దానివశము కాకుండా నిగ్రహించుటకును మానవునికి పురుషకారము, స్వాతంత్ర్యము ఉన్నది. దీనికొక ఉదాహరణము చూడుడు. ఏమియు మొక్కలు లేని దొడ్లో మంచి వర్షము కురిసినచో అనేకరకములైన మొక్కలు పైకిలేచును. అట్లు ఆ మొక్కలు లేవకుండా మనము చేయలేము. కాని ఆ మొక్కలు లేచినతరువాత వానిని పరిశీలించి వానిలో ఉన్న పనస మామిడి మున్నగు మంచి మొక్కలను వృద్ధిచేసుకొనుటకును, పల్లేరు, తుమ్మ మున్నగు చెడ్డ మొక్కలను పీకివేయుటకును, మనకు స్వాతంత్ర్యము ఉన్నది కదా! అలాగే మనకు పూర్వజన్మ కర్మననుసరించి అనేకరకములైన బుద్ధులు రాగ ద్వేషపురస్సరముగ పుట్టును. అట్టి బుద్ధులను పుట్టకుండా మనము చేయలేము. కాని పుట్టిన బుద్ధులలో మంచివానిని వృద్ధిచేయుట కును, దుష్టమైనవానిని నిగ్రహించుటకును మనకు స్వాతంత్ర్యము కలదు. దీనినే పురుషకారము అని పౌరుషమని అంటారు. కనుక కృష్ణపరమాత్మ ఈ 34 వ శ్లోకములో ఆరాగద్వేషములు శ్రేయోమార్గమునకు విఘ్నకర్తలు కనుక వానికి వశము కాకుండా పౌరుషమును ఉపయోగించు కొనవలెను అని బోధించినాడు (34). ఇంకను ఈ జన్మలో మనకు ప్రకృతిగా నుండి ఆయా విషయములందు రాగమునో, ద్వేషమునో పుట్టించిన శక్తి ఈ జన్మకు అది కర్మఫలమే అయినను ఆ పూర్వపు జన్మలో అదికూడ పురుష ప్రయత్నమే, పూర్వజన్మలోని పురుష ప్రయత్నము ఈజన్మకు కర్మగాను, ప్రకృతిగానుఅయి మనలను ప్రవర్తింప చేయుచున్నది కనుక ఉన్నదంతయు పురుష ప్రయత్నమే కాని వెనుకటి జన్మలోని పురుష ప్రయత్న వేగము అనగా, జన్మాంతరీయ కర్మ వేగము ఎంత ఉన్నదో మనకు దెలియక పోవుటచేత, మనము ఈ జన్మలో దానిని నిగ్రహించుటకు ఎంత వేగము గల పురుష ప్రయత్నము చేయవలెనో తెలియుట లేదు. మనము ఇప్పుడు చేసే పురుషప్రయత్నం వెనుకటి కర్మ వేగముకంటె బలహీనమైనచో మనముజయించ లేకున్నాము. అంతకంటె బలవత్తరమైతే నిగ్రహించుచున్నాము. ఇట్లు మార్కండేయులు, సావిత్రి, విశ్వామిత్రుడు తమతమ పూర్వజన్మ కర్మఫలములను తమతమ ప్రబలమైన పురుష ప్రయత్నములచే దాటగలిగినారు. అట్టి ప్రబలమైన పురుష ప్రయత్నమును చేయనిచో ప్రకృతికి వశులైపోతారు అని ఇట్లు శ్రీ కృష్ణపరమాత్మ దైవపౌరుషములను గురించి ఈ 33, 34 శ్లోకాలలో విశదీకరించారు.

(4) కామజ బోధ:- (36 నుంచి 43 వరకు శ్లోకాలు)

ఇట్టి బోధను విని అర్జునుడు, ప్రకృతికి వశ##మై అనర్థము లకు పాల్పడకుండ ఆ అనర్థములకు కారణమును, అనర్థమును జయించుటకు ఉపాయమును తెలిసికొనగోరి, పురుషుడు పాపాచరణమునందు ఇష్టము లేనివాడైనను, రాజుచే నియోగింపబడిన భృత్యునివలె దేనిచే నియోగింపబడి పాప కర్మల నాచరించుచున్నాడు? అని కృష్ణుని ప్రశ్నించినాడు. (36) దీనికి కృష్ణపరమాత్మ ఈ క్రింది విధముగా జవాబు చెప్పుచున్నాడు. అర్జునా! దేనివలన మానవునికి సర్వానర్థములు ప్రాప్తించుచున్నవో అని రజోగుణసముద్భవమైన ఈ కామము ఈ క్రోధమే. కామమే ప్రతిహతమైతే క్రోధముగ మారును. కనుక సర్వానర్థములకు మూలము కామమే; ఈకామము ఎంతటి భోగముతోనూ తృప్తికాదు; మహా పాపి కనుక ప్రతి మానవునికిని ప్రబలశత్రువు ఈ కామమే. (37) పొగ నిప్పును ఆవరించినట్లుగాను, మాలిన్యము అద్దమును ఆవరించినట్లుగాను, మావి గర్భంలో ని పిండమును ఆవరించినట్లుగాను, ఈ కామము జ్ఞానమును ఆవరించును. (38). ఇట్టి దుష్టమై కామముచే జ్ఞానము ఆవరించబడినది. ఈ కామము జ్ఞానికి మాత్రమే నిత్యశత్రువు. అజ్ఞానులకు ఈ కామము ఆరంభములో మిత్రునివలె ఉండి చివరకు అనర్థము వాటిల్లినపుడు శత్రువుగా అగును కనుక అజ్ఞానులకు నిత్య శత్రువు కాదు. జ్ఞాని దీని అనర్థ స్వరూపమును మొదటినుండియు ఎరిగినవాడు కనుక దీనిని నిత్యశత్రువుగా తెలిసికొని జాగ్రత్తగా నుండి దీనికి వశము కాడు (39). ఇట్లు కామము శత్రువైతే దీనిని జచయుంచుటకు దీని ఆశ్రయమేదో తెలిసి కొనవలెను కనుక, దీనికి ఆశ్రయముఇంద్రియాలు, మనస్సు బుద్ధి అని కృష్ణుడు చెప్పి, వీనిద్వారా కామము జ్ఞానమును కప్పిపుచ్చి ప్రతిజీవుని అనేక విధములుగ మోహపెట్టి అనర్థముల పాలుచేయుచున్నది (40). అని బోధించి అర్జునా! నీవు ప్రప్రధమముగా ఇంద్రియములను స్వాధీనము మొనరించుకొని, జ్ఞానవిజ్ఞానములను నశింపచేయు పాపభూయిష్టమైన ఈ కామమును బాగా జయింపుము (41), స్థూలమైన దేహము కంటె సూక్ష్మములైన ఇంద్రియములు ఉత్కృష్టములు; ఇంద్రియములకంటె మనస్సు ఉత్కృష్టము; మనస్సుకంటె బుద్ధి ఉత్కృష్టము; ఇట్లు బుద్ధివరకు ఉన్న అన్ని దృశ్యముల కంటె ఉత్కృష్టమైనది ద్రష్టయగు పరమాత్మ (42), అని విశదీకరించి-ఓ అర్జునా! ఇట్లు ఆత్మయొక్క ఉత్కృష్టమైన స్థితిని తెలిసికొని శమదమాదులచే సంస్కృతమైన మనస్సుచేనీకు ప్రబలశత్రువైన ఈ కామమును జయింపుము అని కృష్ణుడు అర్జునుని హెచ్చరించినాడు (43). ఇట్లు సర్వానర్థములకు కారణము కామము అని చెప్పి అట్టి కామమును జయించుటకు ఉపాయము కృష్ణపరమాత్మ ఈవిధంగా బోధించినాడు. ఇట్లు జ్ఞాననిష్ఠకు ఉపాయభూతమైన కర్మనిష్ఠ అను కర్మయోగము గీతలోని3వ అధ్యాయములో వివరింపబడినది.

___

Geetha Koumudi-1    Chapters